Sunday, October 30, 2022

శక్తివంతమైన పునర్వినియోగ రాకెట్‌ రూపకల్పనపై ఇస్రో దృష్టి


కక్ష్యలోకి భారీ ఉపగ్రహాలను తీసుకెళ్లే సామర్థ్యం గల పునర్వినియోగ రాకెట్‌ను రూపొందించడంలో సహకరించాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పారిశ్రామిక సంస్థలను కోరింది. 2035 నాటికి భారతదేశం స్వావలంబనతో అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలన్న యోచనలో భాగంగా పునర్వినియోగ రాకెట్‌ రూపకల్పనపై దృష్టి సారించింది. దిశగా, ఇటీవల మహేద్రగిరిలో, తదుపరి ప్రయోగంలో లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM-3) రాకెట్ కు అధిక శక్తినిచ్చేందుకు రూపొందించిన సి..-20 క్రయోజెనిక్ ఇంజన్ పై స్థిర పరిక్షను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది.


ప్రస్తుతం, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (ఎన్.జి.ఎల్.వి) గా పిలువబడే పునర్వినియోగ రాకెట్ డిజైన్‌ను శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారని, పారిశ్రామిక రంగం దాని అభివృద్ధికి సహకరించాలని ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ అన్నారు. “ బృహత్తర అభివృద్ధి ప్రక్రియలో భారత పారిశ్రామిక రంగాన్ని  భాగస్వామిగా చేయడమే ఇస్రో ఉద్దేశ్యం,” అని సోమనాథ్ చెప్పారు. 10 టన్నుల బరువున్న  ఉపగ్రహాన్ని భూస్థిర మధ్యంతర కక్ష్య (జియోస్టేషనరీ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ - జి.టి.) లోకిలేదా 20 టన్నుల బరువున్న  ఉపగ్రహాన్ని  భూ సమీప కక్ష్య (లో ఎర్త్ ఆర్బిట్ - ఎల్..) లోకి మోసుకెళ్లేలా రాకెట్ ను రూపొందించుతున్నట్లు ఆయన తెలిపారు.

 

2035 నాటికి భారతదేశం తన స్వంత అంతరిక్ష కేంద్రాన్ని కలిగి ఉండాలని యోచిస్తున్నదని, దానిలో భాగంగా కొత్త రాకెట్ ను రూపొందించుతున్నట్లు ఆయన అన్నారు. సుదూర అంతరిక్ష యాత్రలు, మానవ అంతరిక్ష యాత్రలు, అంతరిక్షంలోకి భారీ వస్తు సామగ్రి చేరవేత, మరియు బహుళ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టటం వంటి వివిధ భవిష్యత్తు అవసరాలకు కూడా పునర్వినియోగ రాకెట్ అవసరమైతుంది. ఇది అంతరిక్ష రవాణాను తక్కువ ఖర్చుతో సాధ్యపడేలా చేస్తుంది.

 

ప్రస్తుతం, 50కి పైగా దిగ్విజయ ప్రయోగాలతో నమ్మకమైన ఉపగ్రహ వాహక రాకెట్ గా పేరొందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పి.ఎస్‌.ఎల్‌.వి) 1980లలోని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రూపొందించబడిందని, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించలేమని సోమనాథ్ చెప్పారు. ఒక సంవత్సరంలోగా ఎన్.జి.ఎల్.వి రూపకల్పనను సిద్ధం చేసి, ఉత్పత్తి కోసం పరిశ్రమకు అందించాలని ఇస్రో యోచిస్తోంది. ఎన్.జి.ఎల్.వి మొదటి ప్రయోగాన్ని 2030లో నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. కాలుష్య కారకాలు కాని కిరోసిన్ మరియు ద్రవీకృత ప్రాణ వాయువు (లిక్విడ్ ఆక్సిజన్) ఇంధనాలనుపయోగించే మూడు-దశల రాకెట్ ఎన్.జి.ఎల్.వి


ఇటీవల సోమనాథ్ చేసిన ప్రసంగం ప్రకారం, వాణిజ్య పరంగా, కక్ష్యలోకి పంపే ప్రతి కిలోగ్రాంకు, పునర్వినియోగ రాకెట్ ద్వారా అయితే  $1900, పునర్వినియోగం కాని రాకెట్ ద్వారా అయితే కిలోకు $3000 రుసుముగా ఇస్రో తీసుకొనే అవకాశం ఉన్నది. ధర ఇతర దేశాలతో పోలిస్తే 'కారు చౌక' అని చెప్పచ్చు. ISpA-E&Y నివేదిక 'డెవలపింగ్ ది స్పేస్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా: ఫోకసింగ్ ఆన్ ఇన్‌క్లూజివ్ గ్రోత్' ప్రకారం, భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2020లో  $9.6 బిలియన్లుగా అంచనా వేయబడిందిఇది 2025 నాటికి $12.8 బిలియన్లకు చేరుకుంటుంది.  2025 నాటికి  'ఉపగ్రహ సేవలు మరియు ప్రయోజనాలు' రంగం $4.6 బిలియన్ల టర్నోవర్‌తో అతిపెద్దదిగా, దీని తర్వాత గ్రౌండ్ సెగ్మెంట్  $4 బిలియన్లు, ఉపగ్రహ తయారీ $3.2 బిలియన్లు మరియు ఉపగ్రహ ప్రయోగ సేవలు $1 బిలియన్ గా అంచనా వేయబడింది. ఉపగ్రహ ప్రయోగ సేవల విభాగం‌లో భారతదేశం వాటా 2020లో $600 మిలియన్లుగా అంచనా వేయబడింది.  2025 నాటికి ఇది 13 శాతం సమ్మేళన వార్షిక వృద్ధి రేటుతో  $1 బిలియన్‌కు చెందుతుందని అంచనా   నివేదిక పేర్కొంది.


అయితే, ఎన్.జి.ఎల్.వి ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు వెల్లడించనందున, మొత్తం రాకెట్  పునర్వినియోగానికి ఉపయోగించబడుతుందా లేదా  కొన్ని భాగాలు మాత్రమేనా అనేది ఇంకా స్పష్టం కాలేదు.


పై  సమాచారాన్ని ఇంగ్లీష్ లో క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే  ... ఈ విడియో వీక్షించండి. 




No comments: