భారత ఉపగ్రహ వాహక రాకెట్ట్ 'ఎల్.వి.ఎం-3' మార్చి 26న, 36 ఒన్‌వెబ్ ఉపగ్రహాలను జయప్రదంగా కక్ష్యలోకి ప్రయోగించిన విషయం తెలిసినదే కదా! ఈ ప్రయోగం, ఆ ఉపగ్రహాలను నిర్మించిన యూ.కే సంస్థ ఒన్‌వెబ్ కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ - ఇస్రో) చేసిన రెండవ వాణిజ్య ప్రయోగం.
ఇస్రో రాకెట్ల సముదాయంలో అన్నిటికన్నా ఎల్.వి.ఎం-3 శక్తివంతమైనది. గతంలో పీ,ఎస్.ఎల్వీ (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్లు వందలాది ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించి, అంతరిక్ష విపణిలో మంచి గుర్తింపు పొందినా, ఎల్.వి.ఎం-3 రాకెట్ అందుబాటు లోకి వచ్చిన తరువాత, వాణిజ్యపరంగా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే సత్తా ఉన్న ఇతర దేశాలకు, తక్కువ రుసుము తీసుకుంటూ భారత్ గట్టి పోటీని ఇస్తూ, కొత్త అవకాశాలను అందుకుంటున్నది.
ఒన్‌వెబ్ కాంట్రాక్టులను ఇస్రో ఎలా గెలుచుకుంది?
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో, గత సంవత్సర కాలంగా, యూరోపియన్ దేశాలకు వాణిజ్య అంతరిక్ష సేవలను రష్యా నిలిపివేసింది. తదనుగుణంగా, ఒన్‌వెబ్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రోస్కోస్మోస్ సంస్థ రద్దు చేసుకున్నది. 2022 వరకూ రోస్కోస్మోస్ సంస్థ, సోయుజ్ రాకెట్ల ద్వారా, 428 ఒన్‌వెబ్ ఉపగ్రహాలను ప్రయోగించింది. అయితే, ఒన్‌వెబ్ యొక్క అత్యవసరాన్ని తీర్చడానికి భారతదేశం సంసిద్ధత తెలిపింది. ఒన్‌వెబ్ - భారత అంతరిక్ష సంస్థ యొక్క వాణిజ్య విభాగం - న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్.ఎస్.ఐ.ఎల్) మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, ఇస్రో ఇప్పటి వరకూ 72 ఉపగ్రహాలను, రెండు విడతలుగా కక్ష్యలోకి ప్రయోగించింది.
ప్రతి ప్రయోగానికి ప్రయోగ రుసుము $60 మిలియన్లు . ఈ కాంట్రాక్ట్ కొరకు పోటీ పడ్డ ఫాల్కన్- 9 ప్రయోగ రుసుము కన్నా, ఎన్.ఎస్.ఐ.ఎల్ ధర $7 మిలియన్లు తక్కువ.
భారతదేశ అంతరిక్ష రంగం యొక్క వాణిజ్య భవిష్యత్తు
వార్షిక ప్రయోగాల సంఖ్య తక్కువగా ఉండటమే భారత అంతరిక్ష రంగం యొక్క వాణిజ్య విజయానికి అతిపెద్ద ప్రతిబంధకమని, ఆ రంగలోని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం, ఒక ఎల్.వి.ఎం-3 రాకెట్ ను తయారుచేయడానికి ఆరు నుండి ఎనిమిది నెలల సమయం పడుతుంది. 2025 నాటికి ఈ వ్యవధిని సగానికి తగ్గించాలని ఎన్.ఎస్.ఐ.ఎల్ మరియు ఇస్రో భావిస్తున్నాయి.
ఎల్.వి.ఎం-3ని ఆరుసార్లు విజయవంతంగా ఇస్రో ప్రయోగించింది. భారతీయ రాకెట్‌లో మోసుకెళ్లిన వాటిలో అత్యంత బరువైనవి, ఒక్కొక్కటి 6,000 కిలోల బరువున్న రెండు ఒన్‌వెబ్ ఉపగ్రహ సమూహాలు. ఇంకా అధిక బరువైన ఉపగ్రహాలను తీసుకెళ్ళే విధంగా ఎల్.వి.ఎం-3 యొక్క సామర్థ్యాన్ని పెంచే పనిలో ఇస్రో ఉంది, 1999లో తన మొదటి వాణిజ్య ప్రయోగం నుండి 36 దేశాలకు చెందిన 348 ఉపగ్రహాలను పీ,ఎస్.ఎల్వీ ప్రయోగించింది. పెరుగుతున్న ప్రపంచ ప్రయోగ పోటీకి దీటుగా, పూర్తిగా పరిశ్రమ-నిర్మిత పీ,ఎస్.ఎల్వీ లను నిర్మించేందుకు ప్రధాన పి.ఎస్.ఎల్వీ కాంట్రాక్టర్ల కన్సార్టియంతో, ఎన్.ఎస్.ఐ.ఎల్ గత సెప్టెంబర్‌లో $104 మిలియన్ల ఒప్పందాన్ని ఖరారు చేసింది. తద్వారా ఉత్పత్తి రేట్లు పెరిగి, ప్రయోగ ధరలను తగ్గించటమే లక్ష్యం.
దీనితోబాటు, ఇస్రో యొక్క కొత్త మాడ్యులర్ ఎస్.ఎస్.ఎల్.వీ (చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం) రాకెట్, 2026 నాటికి సంవత్సరానికి 10 ప్రయోగాల వరకు చేయాలనే లక్ష్యంతో తక్కువ ప్రయోగ ధరతో మార్కెట్‌లోకి ప్రవేశించడానికి అవసరమైన ప్రణాళికలతో ఎన్.ఎస్.ఐ.ఎల్ సిద్ధంగా ఉంది. ఎల్.వి.ఎం-3, పీ,ఎస్.ఎల్వీ మరియు ఎస్.ఎస్.ఎల్.వీ లతో వాణిజ్యపరంగా ఉపగ్రహాలను ప్రయోగించటలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడనున్నది.
గగన్‌యాన్ ప్రోగ్రామ్ లో భాగంగా, ఈ దశాబ్దం మధ్య నాటికి వ్యోమగాములు సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా ఎల్.వి.ఎం-౩కు వివిధ మార్పులను ఇస్రో చేస్తోంది, అలా ఎల్.వి.ఎం-౩ రాకెట్‌ను 'మ్యాన్ రేటింగ్' చేయడంతో, అది మరింత నమ్మదగినదిగా అవుతుంది. మార్చి 26న జరిగిన వన్‌వెబ్ ప్రయోగానికి ఉపయోగించిన ఎల్.వి.ఎం-౩, పెరిగిన మార్జిన్‌లు మరియు అధిక విశ్వసనీయతతో అప్‌గ్రేడ్ చేసిన ఘన రాకెట్ బూస్టర్‌లను వినియోగించిందని ఇస్రో అద్యక్షులు ఎస్. సోమనాథ్ పోస్ట్-లాంచ్ బ్రీఫింగ్‌లో తెలిపారు. భవిష్యత్తులో గగన్‌యాన్ ప్రయోగాల కోసం ఈ బూస్టర్‌లు పరీక్షించబడుతున్నాయి.
No comments:
Post a Comment