మే 19, 2023: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని జూలైలో రెండవ వారంలో నిర్వహించాలని యోచిస్తోంది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ బృందం బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ కేంద్రంలో చంద్రయాన్ ఉపకరణాల తుది అనుసంధాన ప్రక్రియను ప్రారంభించింది.
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం-షారు నుండి ఎల్.వి.ఎం-3 (గతంలో జి.ఎస్.ఎల్.వి మార్క్ 3) రాకెట్ ద్వారా ప్రయోగించబడే చంద్రయాన్-3 వ్యోమనౌక - ప్రొపల్షన్, ల్యాండర్ మరియు రోవర్ అనే మూడు మాడ్యూళ్లను కలిగి ఉంటుంది. చంద్రయాన్-2కి కొనసాగింపు ప్రయోగమైన చంద్రయాన్-3 యాత్రలో చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మాడ్యూల్ సురక్షితంగా దిగుతుంది. మరియు రోవర్ చంద్రుని ఉపరితలంపై తిరుగుతూ, మట్టి నమూనాలను సేకరించి పరిశీధనలను చేస్తుంది.
ఈ యాత్రలో, చంద్ర ఉపరితలంపై ఉన్న రాళ్ళు, ధూళితో కూడిన మట్టి (దాన్ని మూన్ రెగోలిత్ అని అంటారు) యొక్క ప్లాస్మా పర్యావరణం మరియు మూలక కూర్పుల ఉష్ణ-భౌతిక (థెర్మో ఫిజికల్) లక్షణాలను, మరియూ చంద్ర భూకంపాన్ని అధ్యయనం చేయడానికి అవసరమైన శాస్త్రీయ ఉపకరణాలను (పరికరాలు) చంద్రయాన్-3 తీసుకువెళుతుంది. భూమి యొక్క స్పెక్ట్రో-పోలరిమెట్రిక్ సిగ్నేచర్లను చంద్ర కక్ష్య నుండి అధ్యయనం చేయడానికి ఒక ప్రయోగాత్మక పరికరం - స్పెక్ట్రో-పోలరిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ ఉపకరణం ప్రొపల్షన్ మాడ్యూల్లో అమరుస్తారు. ఈ ఉపకరణం ప్రొపల్షన్ మాడ్యూల్ తో పాటు 100 కి.మీ చంద్ర కక్ష్యలో పరిభ్రమిస్తూ అధ్యయనం చేస్తుంది.
చంద్రయాన్-3 వ్యోమనౌక ప్రయోగ సమయంలో ఎదురయ్యే కఠినమైన కంపనం మరియు ధ్వని వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని ధృవీకరించటానికి అవసరమైన పరీక్షలను ఈ ఏడాది మార్చిలో ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్థుత ప్రణాళిక ప్రకారం, రెండు నెలల్లోపు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 అంతరిక్ష నౌకను దించటానికి ఇస్రో సమాయత్తమైతున్నది.
ల్యాండర్ లో అమర్చే ఉపకరణాలు : ఉష్ణ వాహకత మరియు ఉష్ణోగ్రతను కొలవడానికి 'చంద్ర ఉపరితల థర్మోఫిజికల్ ప్రయోగం'; ల్యాండింగ్ సైట్ చుట్టూ భూకంపాన్ని కొలవడానికి 'చంద్ర భూకంప చర్య కోసం పరికరం'; మరియు ప్లాస్మా సాంద్రత మరియు దాని వైవిధ్యాలను అంచనా వేయడానికిగాను 'లాంగ్‌ముయిర్ ప్రోబ్'.
మరియూ, చంద్ర లేజర్ శ్రేణి అధ్యయనాల కోసం నాసా ( అమెరిక యొక్క స్పేస్ ఏజెన్సీ) యొక్క పాసివ్ లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే ఉపకరణాన్ని చంద్రయాన్-3 లో అమర్చుతారు.
రోవర్ అమర్చే ఉపకరణాలు : ల్యాండింగ్ సైట్ సమీపంలోని మూలక కూర్పును పొందడం కోసం 'ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్' మరియు 'లేజర్ ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోపీ'
చంద్రుని ఉపరితలంపై, నిర్దేశిత ప్రదేశంలో కుదుపులు లేకుండా దిగే సామర్థ్యాన్ని ల్యాండర్ కలిగి ఉంటుంది. మరియు ఇది రోవర్‌ను మోహరించగలదు. ఇది దాని కదలిక సమయంలో చంద్రుని ఉపరితలం యొక్క ఇన్-సిటు రసాయన విశ్లేషణను నిర్వహిస్తుంది.
లాంచ్ వెహికల్ ఇంజెక్షన్ నుండి చివరి చంద్ర 100 కిమీ వృత్తాకార ధ్రువ కక్ష్య వరకు ల్యాండర్ మాడ్యూల్‌ను తీసుకువెళ్లడం మరియు దానిని వేరు చేయడం ప్రొపల్షన్ మాడ్యూల్ యొక్క ప్రధాన విధి. ఇది కాకుండా, పైన ఉదహరించినట్లు ప్రొపల్షన్ మాడ్యూల్ ఒక సైంటిఫిక్ పేలోడ్‌ను కూడా కలిగి ఉంది, ఇది ల్యాండర్ మాడ్యూల్ యొక్క విభజన తర్వాత నిర్వహించబడుతుంది.
సెప్టెంబరు 2019లో చంద్రునిపై చంద్రయాన్-2 ల్యాండర్ 'విక్రమ్' సాఫ్ట్-ల్యాండింగ్ చేయడంలో విఫలమైనందున, చంద్రయాన్-3 ల్యాండర్ రూపకల్పనలో మెరుగుపరిచిన నూతన సాంకేతికతలను ఉపయోగించింది. సురక్షితమైన మరియు మృదువైన ల్యాండింగ్‌ను ప్రదర్శించడం; చంద్రునిపై రోవర్ పర్యటనను ప్రదర్శించడం మరియు అక్కడి పరిస్థితులలో శాస్త్రీయ ప్రయోగాలు చేయడం వంటి చంద్రయాన్-3 యాత్ర లక్ష్యాలను సాధించటంలో ఇస్రో నమ్మకంగా ఉంది.