పీఎస్‌ఎల్వీ-సీ55/టెలీయోస్-2 ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుండి ఏప్రిల్ 22, 2023న 14:19 గంటలకు నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
ఈ ప్రయోగంలో, సింగపూర్ కు చెందిన 741 కిలోల బరువున్న టెలీయోస్-2 ఉపగ్రహాన్ని మరియు 16 కిలోల బరువున్న లూమెలైట్-4 సూక్ష్మ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతారు. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్.ఎస్.ఐ.ఎల్) ద్వారా ఇస్రో నిర్వహిస్తున్న మరొక వాణిజ్య రాకెట్ ప్రయోగమిది. ఈ రెండు వాణిజ్య ఉపగ్రహాలతోపాటు, పీఎస్‌ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ (పి.ఒ.ఈ,ఎం) కూడా ప్రయోగింపబడుతుంది.
ఉపగ్రహాల గురించి ...
టెలీయోస్-2
టెలీయోస్-2 ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వ విభాగం డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (డి.ఎస్.టి.ఎ) మరియు సింగపూర్ టెక్నాలజీస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ల సమిష్ఠి భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. సింగపూర్ ప్రభుత్వంలోని వివిధ విభాగాల యొక్క ఉపగ్రహ చిత్రాల అవసరాలను టెలీయోస్-2 తీరుస్తుంది. ఈ ఉపగ్రహంలో ఒక సింథటిక్ ఎపర్చరు రాడార్ (SAR) ఉపకరణాన్ని అమర్చారు. అన్ని వాతావరణ స్థితులలో, పగలు, రాత్రి తేడా లేకుండా ఈ ఉపగ్రహం సేవలను అందించగలదు. 1 మీటర్ పూర్తి-పోలరిమెట్రిక్ రిజల్యూషన్‌లో చాయ చిత్రాలను ఈ ఉపగ్రహం అందిస్తుంది.
లుమిలైట్-4
లుమిలైట్-4 ఉపగ్రహం, సింగపూర్ కు చెందిన ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రిసర్చ్ (ఎ*ఎస్.టి.ఎ.అర్ ) మరియు నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్‌కి చెందిన శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ల సమిష్ఠి భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. హై-పెర్ఫార్మెన్స్ స్పేస్-బోర్న్ వి.హెచ్.ఎఫ్ డేటా ఎక్స్ఛేంజ్ సిస్టమ్ (వి.డి.ఇ.ఎస్) యొక్క సాంకేతిక ప్రదర్శన కోసం ఈ ఉపగ్రహం తయారు చేయబడింది. సింగపూర్ యొక్క ఇ-నావిగేషన్, సముద్ర భద్రతను పెంపొందించడం మరియు ప్రపంచ షిప్పింగ్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చడం లక్ష్యంగా ఈ ఉపగ్రహం పనిచేస్తుంది.
పీఎస్‌ఎల్వీ నాలుగవ దశతో జోడింపబడియుండి, నింగిలో కొన్ని శాస్త్రీయ ప్రయోగాలు చేయడానికి పి.ఒ.ఈ,ఎం-2 ఉపయోగబడుతుంది. ఉపగ్రహాలని నిర్దేశించిన విధంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన తరువాత పీఎస్‌ఎల్వీ నాలుగవ దశ (పి.ఎస్.4) కక్ష్యలో కొంతకాలం పరిభ్రమిస్తుంది. భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో కొన్ని శాస్త్రీయ ప్రయోగాలు చేసేందుకు పి.ఎస్.4ను వేదికగా ఇస్రో ఉపయోగించడం ఇది మూడోసారి. పి.ఒ.ఈ.ఎం-2లో ఏడు ఉపకరణాలను ఏర్పరచారు. వాటిని ఇస్రో, బెల్లాట్రిక్స్, ధృవ స్పేస్ మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థలు రూపొందించాయి.
పీఎస్‌ఎల్వీ-సీ55 ప్రత్యేకతలు
ఇది పీఎస్‌ఎల్వీ యొక్క 57వ ప్రయోగం. మరియు స్ట్రాపాన్ బూస్టలు లేని 'కోర్ అలోన్' కాన్ఫిగరేషన్ తో జరగనున్న పీఎస్‌ఎల్వీ యొక్క 16వ ప్రయోగం.
సమాంతర ఇంటిగ్రేషన్ ప్రక్రియ
మునుపటి ప్రయోగాల మాదిరిగా కాకుండా, పీఎస్‌ఎల్వీ రాకెట్‌లోని వివిధ దశలను అనుసంధానం చేసి ఏకీకృతం చేయడానికి ఉపయోగించిన సమాంతర అనుసంధాన ప్రక్రియ (Parallel integration process) వలన సమయాన్ని గణనీయంగా తగ్గించారు. పీ.ఎస్.ఎల్.వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పి.ఐ.ఎఫ్) అనే నూతన అనుసంధాన భవనాన్ని నిర్మించి, అక్కడ తొలిసారిగా పీ.ఎస్.ఎల్.వీ-సి55 యొక్క మొదటి మరియు రెండవ దశలను అనుసంధానం చేశారు.
గతంలో, పీ.ఎస్.ఎల్.వీ రాకెట్ల దశలన్నీ మొదటి ప్రయోగ వేదిక (ఫస్ట్ లాంచ్‌ప్యాడ్- ఎఫ్.ఎల్.పి) మీదే మొబైల్ సర్వీస్ టవర్ (ఎం.ఎస్.టీ) సహాయంతో అనుసంధానించబడి ఏకీకృతం చేయబడేవి. కాని, ఈ ప్రయోగంలో పి.ఐ.ఎఫ్ భవనంలో తొలి రెండు దశలు, మొబైల్ లాంచ్ పీడెస్టల్ (ఎం.ఎల్.పి) పై ఏకీకృతం చేయబడ్డాయి. పి.ఐ.ఎఫ్ లో తొలి రెండు దశలు అనుసంధానింపబడే సమయంలో, మొదటి ప్రయోగ వేదికపై ఇతర సాంకేతిక కార్యక్రమాలను నిర్వహించుకునే వీలు కలుగుతుంది. ఎం.ఎల్.పి పై అనుసంధానించబడిన రెండు దశలను, పి.ఐ.ఎఫ్ నుండి రైల్ పట్టాలపై మొదటి ప్రయోగ వేదికకు చేర్చారు. తరువాత, రెండవ దశపై, మూడు-నాలుగు దశల మాడ్యూలును అమర్చి, చివరగా, ఎక్విప్మెట్ బే పై ఉపగ్రహాలను అమర్చి, హీట్ షీల్డులను బిగించారు.
ఈ ప్రక్రియ వలన సమయం గణనీయంగా ఆదా అయింది, అంటే, ఇక మీద, తక్కువ వ్యవధిలో పీ.ఎస్.ఎల్.వీ రాకెట్ల దశలను అనుసంధానం చేసేందుకు ఇస్రో కు వీలు కలుగుతుంది. తద్వారా, సంవత్సరంలో ప్రయోగించే పీ.ఎస్.ఎల్.వీ రాకెట్ల ప్రయోగాల సంఖ్య పెరగుతుంది.
No comments:
Post a Comment