జూలై 09, 2023 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన చిన్న రాకెట్ (Small Satellite Launch Vehicle - SSLV) సాంకేతికతను వేలం ద్వారా ప్రైవేట్ పరిశ్రమకు బదిలీ చేసేందుకు నిర్ణయించినట్లు, ఆ సంస్థకు చెందిన అధికార వర్గాలు తెలిపాయి.
500 కిలోల బరువున్న ఉపగ్రహాలను వాణిజ్య పరంగా భూ సమీప కక్ష్యలోకి పంపేందుకై అభివృద్ధి చేసిన చిన్న రాకెట్ SSLV ని ఇస్రో రెండు మార్లు శ్రీహరికోట నుండి ప్రయోగించిన విషయం తెలిసినదే. ఇస్రో త్వరలో ఈ ఉపగ్రహ ప్రయోగ వాహనం యొక్క సాంకేతికతను బిడ్డింగ్ ద్వారా ప్రైవేట్ రంగానికి బదిలీ చేసేందుకు సిద్ధమైతున్నది. "మేము SSLVని పూర్తిగా ప్రైవేట్ రంగానికి బదిలీ చేస్తాము. కేవలం తయారీ మాత్రమే కాదు, పూర్తి సాంకేతికతను బదిలీ చేస్తాము" అని ఆ అధికారి తెలిపారు.
గత ఏడాది ఆగస్టులో SSLV యొక్క తొలి ప్రయోగంలో రెండవ దశ విడిపోయే సమయంలో ఎక్విప్‌మెంట్ బే డెక్‌పై కొద్దిసేపు ఏర్పడిన కంపనం కారణంగా విఫలమైంది. ఆ లోపం యొక్క లోతైన విశ్లేషణ తర్వాత ఇస్రో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఫలితంగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన SSLV ప్రయోగం విజయవంతమైనది. ఈ ప్రయోగంలో EOS-07 ఉపగ్రహాన్ని, అమెరికా సంస్థ అంటారిస్ యొక్క Janus-1 ఉపగ్రహాన్ని, మరియు చెన్నైకి చెందిన స్పేస్ స్టార్టప్ స్పేస్ కిడ్జ్ యొక్క AzaadiSAT-2 ఉపగ్రహాన్ని, 450-కిమీ వృత్తాకార భూ సమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
SSLV 10 కిలోల నుండి 100 కిలోల బరువున్న అతి సూక్ష్మ మరియు సూక్ష్మ ఉపగ్రహాలను భూ సమీప కక్ష్యలోకి ప్రవేశపెట్టే లక్ష్యంగా అభివృద్ధి పరచబడింది. చిన్న చిన్న ఉపగ్రహాలను అభివృద్ధి పరచి, కక్ష్యలోకి పంపే వ్యాపార సంస్థలు రాకెట్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా 'ఆన్-డిమాండ్' ప్రాతిపదికన SSLV ప్రయోగ సేవలు అందుబాటులోకి వస్తాయి.
విజయవంతమైన ప్రయోగాలతో నమ్మదగిన రాకెట్ గా పేరు పొందిన పిఎస్‌ఎల్‌వి లను నిర్మించటానికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు లార్సెన్ అండ్ టూబ్రోల కన్సార్టియంకు ఇస్రో గత సంవత్సరం కాంట్రాక్టును ఇచ్చింది.
వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ సేవల వలన మన దేశీయ అంతరిక్ష పరిశ్రమ, 2025 నాటికి $13 బిలియన్లను ఆదాయాన్ని మన ఆర్ధిక వ్యవస్థకు అందించగలదని, ఇండియన్ స్పేస్ అసోసియేషన్ మరియు కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఇండియా తమ సంయుక్త నివేదికలో పేర్కొన్నాయి.
శాటిలైట్ లాంచ్ వెహికల్-3 (SLV-3), అడ్వాన్స్‌డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ASLV), పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV), జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) మరియు జి.ఎస్ఎల్.వి మార్క్-3 (LVM-3) తరువాత ఇస్రో అభివృద్ధి చేసిన ఉపగ్రహ వాహక రాకెట్లలో SSLV ఆరవది.
అయితే SLV-3 మరియు ASLV ఇప్పుడు వాడుకలో లేవు.
No comments:
Post a Comment