ఫిబ్రవరి 27, 2023: ఫిబ్రవరి 10న జరిగిన ఇస్రో యొక్క చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం యొక్క రెండవ ప్రయోగంలో (ఎస్.ఎస్.ఎల్.వీ -డీ2) భూసమీప కక్ష్యలోకి పంపబడిన ఈ.ఓ.ఎస్-07 ఉపగ్రహం, 'స్పెక్ట్రమ్ మానిటరింగ్ పేలోడ్' అనే ఒక పరికరాన్ని కలిగి ఉంది. ఇది విమానాల కదలికను పసిగట్టగల ఒక సిగ్నల్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ముంబాయిలోని వీ.జే.టి.ఐ. సంస్థ నిర్వహిస్తున్న మూడు రోజుల సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ 'టెక్నోవాంజా' లో విలేకరులతో మాట్లాడుతూ, ఇస్రో యొక్క అహ్మదాబాద్‌కు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ రూపొందించిన ఈ పరికరం విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టడాన్ని నివారించడంలో సహాయపడుతుందని, తిరువనంతపురం లోని ఇస్రో యొక్క ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ డైరెక్టర్ శ్రీ డి. శాందయాళ్ దేవ్ అన్నారు. ఈ పరికరం ఇప్పుడు ప్రయోగదశలో ఉందని ఆయన చెప్పారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ముంబైలోని మాతుంగాలోని వీర్‌మాత జీజాబాయి టెక్నలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (వీజేటీఐ)లో మూడు రోజుల సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్ 'టెక్నోవాంజా' ప్రదర్శనను ఏర్పాటు చేసింది. వివిధ ఉపగ్రహ వాహక రాకెట్లు మరియు ఉపగ్రహాలు, మానవరూప రోబోట్, స్మార్ట్ స్పేస్ రోబోట్, స్పేస్ సెన్సార్లు మరియు ఇతర సంక్లిష్ఠ ఉపకరణాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులు, ఇతరలు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతి మరియు విశ్వంలోని అద్భుతాలను గురించి తెలుసుకోవడానికి ఈ ప్రదర్శన అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది.
వన్ వెబ్ సంస్థ యొక్క 36 ఉపగ్రహాలు మార్చి చివరిలో ఎల్.వీ.ఎం-3 రాకెట్ ద్వారా ప్రయోగించబడతాయని, మరియు చంద్రయాన్-3 జూన్‌లో ప్రయోగించబడే అవకాశం ఉందని శ్రీ శాందయాళ్ దేవ్ అన్నారు. దీనికి సంబంధించిన అన్ని గ్రౌండ్ టెస్ట్‌లు విజయవంతంగా నిర్వహించబడ్డాయని ఆయన చెప్పారు. హెలికాప్టర్ నుండి పునర్వినియోగ ప్రయోగ వాహనం యొక్క ల్యాండింగ్ ట్రయల్ కూడా త్వరలో జరుగుతుందని ఆయన వివరించారు.