భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్.ఎస్.ఎల్.వీ), చిన్న, అతి చిన్న (సూక్ష్మ లేదా నానో) ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగ అవసరాలకు అనుగుణంగా , తక్కువ ఖర్చుతో పారిశ్రామిక రంగం ఉత్పత్తి చేసే విధంగా రూపొందించబడింది. ఘన ఇంధనంపై పనిచేసే మూడు దశలను, ద్రవ ఇంధనంతో పనిచేసే వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ (వీ.టీ.ఎం) ను టెర్మినల్ దశను ఈ రాకెట్ కలిగి ఉన్నది. 2మీ వ్యాసం మరియు 34మీ పొడవు, సుమారు 120 టన్నుల బరువును గలిగిన ఎస్.ఎస్.ఎల్.వీ, 500 కే.జీ ల బరువున్న ఉపగ్రహాన్ని శ్రీహరికోటనుండి నుండి 500 కి.మీ దూరంలో ప్లానార్ కక్ష్యలోకి ప్రయోగించగలదు. తక్కువ ఖర్చుతో బహుళ ఉపగ్రహాలను ప్రయోగించే సౌలభ్యం, కనీస ప్రయోగ మౌళిక వసతులతో గిరాకీకి అనుగుణంగా తక్కువ వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేసే వీలు వంటి వివిధ ప్రయోజనాలే ఎస్.ఎస్.ఎల్.వీ ప్రత్యేకతలు.
తొలి ప్రయోగం వైఫల్యం
ఎస్.ఎస్.ఎల్.వీ యొక్క తొలి ప్రయోగం (ఎస్.ఎస్.ఎల్.వీ-డి1 /ఈఓఎస్-02) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి 7 ఆగస్టు 2022న జరిగింది. ఈ ప్రయోగం యొక్క లక్ష్యం ఈఓఎస్-02 ఉపగ్రహాన్ని 37.21 డిగ్రీల వాలుతో, 356.2 కి.మీ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టడం. దీనితో పాటు, ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలను ప్రోత్సహించడానికి ఏర్పరచిన కొత్త నోడల్ ఏజెన్సీ 'ఇన్-స్పేస్' (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) అనుమతించిన ఆజాదిశాట్ అనే విద్యార్థి ఉపగ్రహం కూడా ప్రయోగించబడింది.
అయితే, అన్ని ఘన ఇంధన దశల యొక్క పనితీరు సాధారణంగా ఉన్నప్పటికీ, వేగంలో లోపం కారణంగా అత్యంత దీర్ఘవృత్తాకార అస్థిర కక్ష్యలోకి ప్రయోగించబడింది. ఆ కారణంగా ఈ ప్రయోగం విఫలమైయింది.
తొలి ప్రయోగం వైఫల్య కారణాన్ని స్పష్టంగా గుర్తించిన నిపుణుల బృందం కొన్ని దిద్దుబాటు చర్యలను సూచించింది. తదనుగుణంగా, ఎస్.ఎస్.ఎల్.వీ ని రెండవ ప్రయోగానికి (ఎస్.ఎస్.ఎల్.వీ-డి2 /ఈఓఎస్-07) సిద్ధం చేశారు. ఈఓఎస్-07 ఉపగ్రహంతో పాటు మరో రెండు ఉపగ్రహాలను (మొత్తం బరువు 334 కిలోలు)
కూడా ఈ ప్రయోగంలో నింగిలోకి పంపుతారు. ఈ ప్రయోగాన్ని ఫిబ్రవరి 10న జరపడానికి ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి.
No comments:
Post a Comment