స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్‌ఎస్‌ఎల్‌వి) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్మించిన చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం.
గిరాకీకి అనుగుణంగా భూ సమీప కక్ష్యకి 500 కిలోల వరకు ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో ఎస్.ఎస్.ఎల్.వీ రాకెట్ ని రూపొందించింది. తక్కువ ఖర్చుతో బహుళ ఉపగ్రహాలను ప్రయోగించే సౌలభ్యం, కనీస అవసర ప్రయోగ మౌళిక వసతులతో, గిరాకీకి అనుగుణంగా తక్కువ వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేసే వీలు, వంటి వివిధ ప్రయోజనాలే ఎస్.ఎస్.ఎల్.వీ ప్రత్యేకతలు.
వివిధ దేశాలు పోటీబడుతున్న బహుళ-బిలియన్ డాలర్ల అంతరిక్ష వాణిజ్యంలో, తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను భూ సమీప కక్ష్యలోకి పంపటంలో భారతదేశానికి మంచి గిరాకీని చేకూర్చటంలో ఈ రాకెట్ సహాయపడుతుంది.
ఎస్.ఎస్.ఎల్.వీ, దాని వివిధ దశలు :
ప్రధానంగా ఇది మూడు దశల రాకెట్. మూడు దశలూ ఘన ఇంధనం పైనే పనిచేస్తాయి. వీటికి తోడు, అదనంగా ద్రవ ఇంధన ఆధారిత వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ (వి.టి.ఎం) టెర్మినల్ దశ రాకెట్ పై భాగాన ఉంటుంది. దీని బరువు దాదాపు 120 టన్నులు, పొడవు 34 మీటర్లు , చుట్టు కొలత 2 మీటర్లు.
తొలి దశ బరువు 87 టన్నులు ఉండగా, రెండు, మూడు దశల బరువు 7.7 టన్నులు మరియు 4.5 టన్నులు. వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ (వి.టి,ఎం) టెర్మినల్ దశ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేరుస్తుంది.
మొదటిది దశ మోటార్ 2,496 కిలో న్యూటన్ల తోపుడు శక్తిని (Thrust) ఇవ్వగా, రెండవ దశ, మూడవ దశ మోటార్లు, 234.2 కిలో న్యూటన్ల మరియు కిలో న్యూటన్ల తోపుడు శక్తిని (Thrust) సమకూరుస్తాయి.
రోల్, పిచ్ మరియు యా కంట్రోల్ కోసం ఎనిమిది 50 న్యూటన్ల ద్రవ ఇంధన ఇంజన్లు, వేగం పెంపొందించటానికి మరో ఎనిమిది 50 న్యూటన్ల ద్రవ ఇంధన ఇంజన్లు వి.టి.ఎం లో అమర్చబడ్డాయి.
ఈ రాకెట్ చిన్న, సూక్ష్మ లేదా నానో ఉపగ్రహాలను (10 నుండి 500 కిలోలు) 500 కి.మీ ప్లానార్ కక్ష్యలోకి ప్రవేశపెట్టగలదు.
ఎస్.ఎస్.ఎల్.వీ తొలి ప్రయోగం విఫలం
అనేక సంవత్సరాల అభివృద్ధి తర్వాత, ఎస్.ఎస్.ఎల్.వీ యొక్క తొలిప్రయోగం ( ఎస్.ఎస్.ఎల్.వీ-డి 1) మైక్రో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం (EOS-02) మరియు మరొక ఉపగ్రహంతో , ఆగస్టు 7, 2022 ఉదయం 9.18 గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుండి జరిగింది. కానీ ఈ ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాల వల్ల విఫలం చెందింది.
ఎస్.ఎస్.ఎల్.వీ-డి-2 ప్రయోగ విజయం
ఎస్.ఎస్.ఎల్.వీ యొక్క రెండవ ప్రయోగం (ఎస్.ఎస్.ఎల్.వీడి-2) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఫిబ్రవరి 10న ఉదయం 9:18 గంటలకు జరిగింది. ఈ రాకెట్ ద్వారా ఈఓఎస్-07 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన జానూస్-1 మరియూ భారత దేశ పాఠశాల విద్యార్ధులు రూపొందించిన ఆజాదిశాట్-2 సూక్ష్మ ఉపగ్రహాలను (మూడింటి బరువు 334 కిలోలు), 450-కిమీ దూరంలో భూ సమీప వృత్తాకార కక్ష్యలోకి పంపడంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఘన విజయం సాధించింది. నింగికెగసిన 15 నిమిషాల తరువాత, నిర్ణీత వ్యవధిలో, నిర్ణీత క్రమంలో మూడు ఉపగ్రహాలను ఒకదాని తరువాత మరొకటిగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎస్.ఎస్.ఎల్.వీ తొలి ప్రయోగం విఫలమైన నేపధ్యంలో, ఈ ప్రయోగం ప్రాముఖ్యత సంతరించుకుంది.
500 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను 'లాంచ్-ఆన్-డిమాండ్' ప్రాతిపదికన భూ సమీప వృత్తాకార కక్ష్యలోకి ప్రయోగించేందుకై రూపొందింపబడిన ఎస్.ఎస్.ఎల్.వీ ప్రయోగ విజయంతో వాణిజ్య ప్రయోగాల పరంపరలో ఇస్రో ఒక పెద్ద ముందడుగు వేసింది.
No comments:
Post a Comment