చిన్న తరహా వాణిజ్య ప్రయోగాలను తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు వీలు
ఫిబ్రవరి 10న ఉదయం 9:18 గంటలకు ప్రయోగించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్-డి-2 (ఎస్.ఎస్.ఎల్.వీడి-2) రాకెట్ ద్వారా ఈఓఎస్-07 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన జానూస్-1 మరియూ భారత దేశ పాఠశాల విద్యార్ధులు రూపొందించిన ఆజాదిశాట్-2 సూక్ష్మ ఉపగ్రహాలను (మూడింటి బరువు 334 కిలోలు), 450-కిమీ దూరంలో భూ సమీప వృత్తాకార కక్ష్యలోకి పంపడంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఘన విజయం సాధించింది. నింగికెగసిన 15 నిమిషాల తరువాత, నిర్ణీత వ్యవధిలో, నిర్ణీత క్రమంలో మూడు ఉపగ్రహాలను ఒకదాని తరువాత మరొకటిగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ఎస్.ఎస్.ఎల్.వీ యొక్క రెండవ ప్రయోగం. ఈ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC) షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుండి నిర్వహించబడింది. గత సంవత్సరం ఆగస్టు 7న జరిగిన ఎస్.ఎస్.ఎల్.వీ యొక్క తొలి ప్రయోగం విఫలమైన నేపధ్యంలో, ఈ ప్రయోగం ప్రాముఖ్యత సంతరించుకుంది.
500 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను 'లాంచ్-ఆన్-డిమాండ్' ప్రాతిపదికన భూ సమీప వృత్తాకార కక్ష్యలోకి ప్రయోగించేందుకై ఎస్.ఎస్.ఎల్.వీ ని రూపొందించారు. ఈ ప్రయోగ విజయంతో వాణిజ్య ప్రయోగాల పరంపరలో ఇస్రో ఒక పెద్ద ముందడుగు వేసింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) యొక్క స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్.ఎస్.ఎల్.వీ), చిన్న, అతి చిన్న (సూక్ష్మ లేదా నానో) ఉపగ్రహాల వాణిజ్య ప్రయోగ అవసరాలకు అనుగుణంగా , తక్కువ ఖర్చుతో పారిశ్రామిక రంగం ఉత్పత్తి చేసే విధంగా రూపొందించబడింది. ఘన ఇంధనంపై పనిచేసే మూడు దశలను, ద్రవ ఇంధనంతో పనిచేసే వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ (వీ.టీ.ఎం) ను టెర్మినల్ దశను ఈ రాకెట్ కలిగి ఉన్నది. 2మీ వ్యాసం మరియు 34మీ పొడవు, సుమారు 120 టన్నుల బరువును గలిగిన ఎస్.ఎస్.ఎల్.వీ, 500 కే.జీ ల బరువున్న ఉపగ్రహాన్ని శ్రీహరికోటనుండి నుండి 500 కి.మీ దూరంలో ప్లానార్ కక్ష్యలోకి ప్రయోగించగలదు. తక్కువ ఖర్చుతో బహుళ ఉపగ్రహాలను ప్రయోగించే సౌలభ్యం, కనీస ప్రయోగ మౌళిక వసతులతో గిరాకీకి అనుగుణంగా తక్కువ వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేసే వీలు వంటి వివిధ ప్రయోజనాలే ఎస్.ఎస్.ఎల్.వీ ప్రత్యేకతలు.
ఈఓఎస్-07 ఉపగ్రహం బరువు 156.3 కిలోలు. దీనిని ఇస్రో రూపొందించి, దీనిలో ఎం.ఎం.-వేవ్ హ్యూమిడిటీ సౌండర్ మరియు స్పెక్ట్రమ్ మానిటరింగ్ పేలోడ్ ఉన్నాయి.
జానస్-1 ఉపగ్రహం బరువు 10.2 కిలోలు. దీన్ని అమెరికాకు చెందిన ఆంటారిస్ సంస్థ తయారు చేసింది. ఇది ఆంటారిస్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సాంకేతికతతో పని చేసే స్మార్ట్ సూక్ష్మ ఉపగ్రహం.
8.7-కిలోల బరువున్న ఆజాదీశాట్-2 సూక్ష్మ. ఉపగ్రహన్ని, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 750 మంది బాలికలు, చెన్నైలోని స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ మార్గనిర్దేశంలో సంయుక్త రూపొందించారు. ఇది ఔత్సాహిక రేడియో కమ్యూనికేషన్, మరియూ అంతరిక్షంలో రేడియేషన్ స్థాయిలను కొలవడం వంటి పనులను లక్ష్యంగా పెట్టుకుంది.
No comments:
Post a Comment