అగ్నికుల్ కాస్మోస్ తన రెండు దశల రాకెట్ అగ్నిబాణ్ యొక్క ప్రయోగం డిసెంబర్ 2022లో చేయబోతున్నది. ఆ టెస్ట్ లాంచ్ యొక్క ఫలితాల ఆధారంగా, మార్చి లేదా ఏప్రిల్ 2023 లో కస్టమర్ పేలోడ్‌లతో వాణిజ్య ప్రయోగాన్ని ఎస్‌డిఎస్‌సి షార్, శ్రీహరికోట నుండి నిర్వహించాలని యోచిస్తున్నట్లు అగ్నికుల్ కాస్మోస్ సంస్థ యొక్క సహ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ శ్రీనాథ్ రవిచంద్రన్ తెలిపారు.
చెన్నైకి చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ అయిన అగ్నికుల్ కాస్మోస్ వారి రాకెట్ అగ్నిబాణ్ ను పూర్తి స్థాయి వాణిజ్య ప్రయోగాలకు గాను రూపొందిస్తున్నట్లు శ్రీనాథ్ రవిచంద్రన్ తెలిపారు. స్టార్టప్ యొక్క సింగిల్-పీస్ 3 డి-ప్రింటెడ్ ఇంజిన్ అయిన అగ్నిలెట్ పై స్థిర పరీక్ష ఇటీవల తిరువనంతపురంలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ - ఇస్రో) యొక్క ప్రధాన కేంద్రం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (విఎస్ఎస్సి) లో జయప్రదంగా జరిగింది.
ఆపరేషన్స్ స్పెషలిస్ట్ రవిచంద్రన్ 2017 లో ఐఐటి మద్రాస్-ఇంక్యుబేటెడ్ స్టార్టప్‌ను స్థాపించారు. ఇది గత ఏడాది సిరీస్ ఎ రౌండ్‌లో 11 మిలియన్ డాలర్లతో సహా, వెంచర్ క్యాపిటల్ సంస్థ మేఫీల్డ్ ఇండియా మరియు ఏంజెల్ ఇన్వెస్టర్లు ఆనంద్ మహీంద్రా మరియు నితిన్ కామత్ వంటి పెట్టుబడిదారుల మద్దతుతో సహా $15 మిలియన్లను సేకరించింది.
డిసెంబర్ లో జరిగే టెస్ట్ లాంచ్ వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను ధృవీకరించడంలో సహాయపడుతుంది. "డైనమిక్స్, ఏవియానిక్స్, నావిగేషన్ వంటి పలు సాంకేతిక వ్యవస్థల పని తీరును ధృవీకరించే విధంగా మేము మా పరీక్ష ప్రయోగాన్ని నిర్వహిస్తాము. అది ఎలా జరుగుతుందో మేము చూస్తాము" అని శ్రీనాథ్ రవిచంద్రన్ అన్నారు. టెస్ట్ లాంచ్ ఫలితాల ఆధారంగా, అగ్నికుల్ కాస్మోస్ పూర్తి స్థాయి వాణిజ్య ప్రయోగానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ విక్రమ్-ఎస్ తో పోలిస్తే అగ్నిబాణ్ విభిన్నం
నవంబర్ 12 మరియు 16 మధ్య హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ప్రయోగించే విక్రమ్-ఎస్ దేశంలో మొదటి ప్రైవేటుగా రంగ రాకెట్ అవుతుంది. అయితే, అగ్నికుల్ కాస్మోస్ యొక్క ప్రయోగం విక్రమ్-ఎస్ ప్రయోగంతో పోలిస్తే, చాలా భిన్నంగా ఉంటుందని శ్రీనాథ్ రవిచంద్రన్ అన్నారు. ఘన ఇంధనాన్ని ఉపయోగించే విక్రమ్-ఎస్ ఇంజిన్ మాదిరిగా కాకుండా, అగ్నికుల్ కాస్మోస్ యొక్క ఇంజన్లు సెమీ క్రియోజెనిక్ మరియు ద్రవ ఇంధనాలను ఉపయోగించుకుంటాయి.
రెండు స్టార్టప్ కంపెనీల మధ్య వ్యత్యాసం వాణిజ్య పరంగా వారు అందించే సేవలలో కూడా ఉంది. స్కైరూట్ ఏరోస్పేస్ అధిక బరువున్న ఉపగ్రహలను ప్రయోగించ గలదు. కాని మేము చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే లక్ష్యంతొ పనిచేస్తున్నామని ఆయన అన్నారు.
భారత ప్రభుత్వం 2020 లో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) ను అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలో సింగిల్-విండో అటానమస్ ఏజెన్సీగా స్థాపించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ అంతరిక్ష సంస్థల మధ్య కమ్యూనికేషన్, ఇంటిగ్రేషన్ మరియు అనుమతి-సంబంధిత సంక్లిష్టతలను తగ్గించడానికి రెగ్యులేటర్ కేంద్ర బిందువుగా ఇన్-స్పేస్ ఉద్భవించింది. తదనుగుణంగానే అగ్నికుల్ కాస్మోస్ ఇంజిన్ పరీక్ష విఎస్ఎస్సి లో నిర్వహించబడింది.
అగ్నికుల్ తో పరస్పర చర్చల తరువాత ఇస్రో నవంబర్ 11, 2022 న అగ్నిబాణ్ కోసం మొదటి ఫ్లైట్ టెర్మినేషన్ సిస్టమ్ (ఎఫ్‌టిఎస్) ను, సంబంధిత ఇతర వ్యవస్థలను అందించింది. ఒక ప్రైవేట్ రాకెట్ కు ఇస్రో రూపొందించిన వ్యవస్థను సరఫరా చేయడం ఇదే మొదటిసారి. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ లో శ్రీహరికోట నుండి ప్రయోగించబోయే అగ్నిబాణ్ రాకెట్లో ఈ వ్యవస్థలను ఉపయోగిస్తారు.
18 మీ. ఎత్తు, 1.3 మీ. వ్యాసం, 14000 కిలోల బరువు ఉన్న అగ్నిబాణ్ రెండు దశల ఉపగ్రహ వాహక రాకెట్. ఒకటి లేదా అనేక ఉపగ్రహాలను అమర్చటానికి వీలుగలిగించే 2 మీ x 1.5 మీ. చోటు (ఎన్వలప్) ఫెయిరింగ్ లో ఉంటుంది. అందులో ఒక ఐచ్ఛిక బేబీ స్టేజ్ ని అమరుస్తారు. 700 కి.మీ ఎత్తులో ఉన్న కక్ష్యలకు మొత్తం 100 కిలోల పేలోడ్లను ప్రయోగించే సామర్థ్యం అగ్నిబాణ్ కు ఉన్నది. తక్కువ ఎత్తు మరియు అధిక వంపు (లో ఇంక్లినేషన్) ఉన్న కక్ష్యలకు కూడా పేలోడ్లను ప్రయోగించగలదు. అన్ని దశలలో లిక్విడ్ ఆక్సిజెన్/కిరోసిన్ ఇంజిన్‌లపై పనిచేసే అగ్నిబాణ్ కస్టమర్ల అవసరాలననుసరించి ఇంజన్లను ఉపయోగిస్తుంది. అగ్నిబాణ్ అన్ని సమయాలలో ఒకే సంఖ్యలో ఇంజిన్‌లతో ఎగరదు. మిషన్, ఉపగ్రహం మరియు ప్రయోగ ప్రదేశం వంటి అంశాలు రాకెట్ మొదటి దశలో ఎన్ని ఇంజన్లు ఉంచాలో నిర్ణయిస్తాయి.
పూర్తిగా మొబైల్ ప్రయోగ వేదిక (ధనుష్) నుండి అగ్నిబాణ్ ను ప్రయోగించవచ్చు. అందువల్ల ప్రపంచంలో 10 కంటే ఎక్కువ లాంచ్‌పోర్ట్‌లను నుండి ప్రయోగించడానికి అవకాశం ఉన్నది.
No comments:
Post a Comment